Saturday, 15 August 2020

ఉచితాలు ఉచితమేనా..

 మహాభారతంలో మనకు తెలియని కథలెన్నో దాగి ఉన్నాయి...!


ప్రజలు ఉచితానికి,దానాలకు అలవాటు పడితే ఏం జరుగుతుందో..మహాభారతంలోని ఒక కథని చదివి తెలుసుకోండి..మహాభారతం అనగానే ఎంతసేపు జూదం, ద్రౌపదీ వస్త్రాపహరణం, కురుక్షేత్ర యుద్ధం... వీటినే చూపెడతారు, అవే చెబుతారు. నిజానికి ఇప్పటి ఈ సమాజానికి కావాల్సిన "నీతికథలు" ఎన్నో ఉన్నాయి...!!!

అందులో ఒకటి ఇది...

పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని  పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు  అహంకారంగా  మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం  కృష్ణుడు ధర్మరాజుని వేరే  రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.

ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు... ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది !ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా   బంగారాన్ని దాచుకోవాలి కానీ అలా వీధిలో పడేస్తే ఎలా ?.. అనడంతో..ఆమె... మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును  మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది !!!

ఆ రాజ్యపు సంపదను  గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.ఇక రాజును  కలవడానికి  ఇద్దరు వెళ్లారు.కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు..."రాజా...ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు " అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు... "కృష్ణా... మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా  పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన  అవసరం లేదు...  ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు... అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో... ఈయన రాజ్యంలో అంతమందిని   పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను  అన్నారు.."

ఆ రాజు మాటలు విని, తన రాజ్యస్థితిని  తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు !!!

సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం... ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా  వివరించారు !!!మరి మన పాలకులు  ఎప్పుడు తెలుసుకుంటారో... ప్రజలు ఎప్పుడు మారుతారో...

వాట్సఫ్ సేకరణ..

Wednesday, 12 August 2020

మహాభారతంలో Interstellar ll The Story About Interstellar in Mahabharatha

       మహాభారతంలో Interstellar కథ

మహాభారతంలో ఒక కథ ఉంది. కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంటపెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉంటాడు. అది ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు. దిగ్భ్రాంతి చెందిన రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ, ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ. 


ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం. ఆ చిత్రం పేరు 'Interstellar'. క్లుప్తంగా చెప్పాలంటే ఆ సినిమాలో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు. కూతురంటే అతనికి ప్రాణం. అయితే తరచూ వారి ప్రాంతంలో ధూళి తుఫానులు రావడం వల్ల తన పంట మొత్తం నాశనం అవుతూ ఉండేది. ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు. తన కూతురు గదిలో ధూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ ధూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో(ఇది గుర్తుపెట్టుకోండి). అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని(Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్. 

అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి 'వార్మ్ హోల్' (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారినందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా. Warm hole అంటే ఒక గెలాక్సీ నుండి ఇంకో గెలాక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి.అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని. ఒకవేళ అనుకున్నట్టు జరక్కపొతే ఆ గ్రహం మీదనే భూమిపై ఉన్న మనుషుల డిఎన్ఏని గుడ్ల రూపంలో తయారు చేసి, ఆ గ్రహం మీద వాటిని పొదగడం వల్ల అక్కడ కూడా మునుష్యులను సృష్టించడం. అయితే అతను భూమిపై నుండి వెళ్లే సమయానికి హీరో కూతురు వయసు సరిగ్గా 10 సంవత్సరాలు. ఆ తరువాత కథ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి(Black hole) ప్రవేశిస్తాడు. అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం. నాలుగవ డైమెన్షన్ అనగా కాలం. అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట. అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించగలడన్న మాట. అయితే ఆ హీరో కాలంలో వెనక్కి ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు. ఇప్పుడు అర్ధం అయ్యిందా. అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే. ఇక ఆ తరువాత కొంత కథ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు. ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో సమానం. 

పైన మహాభారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కథగానే తీసుకుంటాం. కాని ఆ కథలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే "Time dilation", "Black hole", " Warm hole" వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో చెప్పేయడం జరిగింది. అందుకే స్వామీ వివేకానంద అన్నారు సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది అని. 

ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "Time dilation" అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం. పాండవులు చివరిలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు ప్రయాణం చేయడం. స్వర్గం ఉండేది భూమిపై కాదు. మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది. నాక్కుడా వచ్చింది. పైన చెప్పిన Warm hole సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి. హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే Warm holes ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది. 

గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వారికి 11 - 15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రదానం చేస్తారు. ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు. ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు. ఎందుకో తెలుసా. చనిపోయిన 11 - 15 రోజుల వరకూ జీవాత్మ భూమిపైనే ఉంటుంది. అందుకే ప్రతీరోజు పిండ ప్రదానం చేస్తాం. ఆ తరువాత జీవాత్మ స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది(గరుడ పురాణం ప్రకారం). ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం. అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజుకొకసారి పెట్టినట్టు. ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు. అప్పుడు  సంవత్సరానికి ఒకసారే పెడతాం. ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి. ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే Time Dilation అంటాం. మన తరువాత ఎప్పుడో వచ్చిన ఎడారి మతాలు ఇలాంటి విజ్ఞానానంలో మనకు దరిదాపుల్లో కూడా రాలేవు. అందుకే భారతీయ సనాధన ధర్మం ఎంతో కాలం పూర్వమే ఉద్భవించింది. సైన్స్ కి కూడా అంతుచిక్కని ఎన్నో చిక్కుముడులను చాలాక్రితమే వేదాలు,శాస్త్రాలు,పురాణాలు రూపంలో మనకందించింది..

సేకరణ: వాట్సాఫ్ ఫార్వర్డ్ మెస్సేజ్.. ఈ సమాచారాన్ని అందించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. పేరు తెలియక ప్రచురించలేకపోతున్నాను..క్షమించాలి)